సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): జల మండలి సిబ్బంది తీరుతో వినియోగదారులు నిత్యం ఏదో ఒక సమస్యతో సతమతమవుతున్నారు. సుమారు 8 వేల మంది సిబ్బందితో పటిష్టమైన వ్యవస్థను కలిగిన జలమండలి.. వినియోగదారులకు అందించే సేవల విషయంలో మాత్రం తడబడుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల దాకా ప్రతి పనినీ క్షుణ్నంగా పరిశీలించాల్సి ఉంటుంది. అయితే జలమండలిలో అలాంటిదేమీ జరగుతన్నట్లు లేదనే విమర్శలున్నాయి. ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని ప్రాంతాలను జలమండలి పరిధిలోకి తీసుకొచ్చేందుకు గతంలోనే ఆయా గ్రామాల నల్లా కనెక్షన్లను మెర్జ్ చేసేందుకు సర్వే నిర్వహించారు. సంబంధిత మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల నుంచి నల్లా కనెక్షన్ల డాటాను సేకరించారు. దానికి అనుగుణంగా ఇంటింటికీ తిరిగి నల్లా కనెక్షన్లను జలమండలి పరిధికి తీసుకొస్తూ వారికున్న కనెక్షన్లకు క్యాన్ నంబర్లు ఇచ్చి నెలనెలా బిల్లులు వసూలు చేసేందుకు శ్రీకారం చుట్టారు. కనెక్షన్ లేనివారికి కొత్త కనెక్షన్ ఇచ్చి క్యాన్ నంబర్లు అలాట్ చేశారు.
అయితే ఈ సర్వే చేయడంలో సిబ్బంది అత్యుత్సాహం, చిన్నచిన్న పొరపాట్ల వల్ల వినియోగదారులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. కొన్నిచోట్ల ఒకే ఇంటికి రెండుసార్లు సర్వేకు వెళ్లడం చేశారు. ఆయా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఇచ్చిన డాటా ప్రకారం ప్రతి కనెక్షన్‌కు క్యాన్ నంబర్ అలాట్ చేశారు. ఇలా చేసే క్రమంలో ఒకే కనెక్షన్‌కు రెండు, మూడు క్యానె నంబర్లు ఇచ్చారు. దీని వల్ల ఒక కనెక్షన్ ఉన్నా కొంతమందికి రెండు క్యాన్ నంబర్లు రావడంతో రెండు బిల్లులు జనరేట్ అయ్యాయి. దీంతో డబ్బులు చెల్లించినా వారికి డబుల్ బిల్లులు వస్తున్నాయి. పెండింగ్‌లో ఉంటే వడ్డీలు పెరిగిపోతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. ఇలా ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా జలమండలిలోకి మెర్జ్ అయిన వందలాది మందికి ఈ సమస్య వస్తున్నది.
ఒకే కనెక్షన్‌పై రెండు క్యాన్ నంబర్లు ఉండి, డబుల్ బిల్ వస్తున్న వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత సర్కిల్ కార్యాలయానికి వెళ్లి తమ సమస్యలను చెప్పుకుంటున్నా పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తున్నదని వాపోతున్నారు. అయినా పరిష్కారం కాకపోవడంతో కేంద్ర కార్యాలయానికి(ఖైరతాబాద్) రావాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటున్నారు. మున్సిపాలిటీల నుంచి తీసుకున్న డేటాలో కనెక్షన్ అప్పటికే ఉన్నవారు, కొత్తగా తీసుకున్నవారిని గుర్తిస్తే ఈ సమస్య వచ్చేది కాదని అభిప్రాయపడుతున్నారు.ఒకే కనెక్షన్‌పై రెండు క్యాన్ నంబర్లు ఉన్న వినియోగదారులను గుర్తించి అధికారులే ఒక క్యాన్ నంబర్‌ను తొలగించాలని కోరుతున్నారు.