Village Police | మడికొండ: ప్రజలకు రక్షణ కల్పించేందుకు విలేజ్ పోలీస్ ఆఫీసర్లు దోహదపడుతారని సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా తెలిపారు. మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కడిపికొండలో శనివారం ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన విలేజ్ పోలీస్ ఆఫీసర్(వీపీవో) కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డితో కలిసి ఆమె హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో షేక్ సలీమా మాట్లాడుతూ.. పోలీస్ అధికారులను గ్రామాల్లోకి పంపి పోలీసులపై ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించి మానసిక స్థెర్యం కల్పించడం, ప్రజలతో సఖ్యతతో ఉండడం, పోలీస్ కర్తవ్యాలు, మహిళలు, పిల్లలు, వృద్ధుల సంరక్షణ మొదలైన వాటిని తెలుసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు విలేజ్ పోలీసులకు సంపూర్ణ సహకారం అందించాలని సూచించారు. ఏసీపీ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. వీపీవో విధులు, చేపట్టే కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం విలేజ్ ఆఫీసర్‌కు చెందిన ఫోటో, వివరాలతో ముద్రించిన వాల్ పోస్టర్లను డీసీపీ ఆవిష్కరించారు. మడికొండ, భట్టుపల్లి, కొత్తపల్లి, కుమ్మరిగూడెం, తరాలపల్లి, టేకులగూడెం గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.