హనుమకొండ చౌరస్తా, మార్చి 27 : 1984లో కొనుగోలు చేసిన భూమిని అక్రమంగా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని, కబ్జా కోరల నుంచి తమ భూమిని కాపాడి తమకు న్యాయం చేయాలని భూ బాధితులు కోరారు. గురువారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూ బాధితుడు చిట్టి రెడ్డి రజనీకర్ రెడ్డి మాట్లాడారు. తాము దుగ్గంపూడి జోజిరెడ్డి దగ్గర 30 మందిమి కలిసి కుమార్పల్లి శివారులో సర్వే నెంబర్ 126, 117 ఎకరం మూడు గంటల భూమి కొనుగోలు చేసి 2017లో భూమి కాస్ట్ చేయించామన్నారు.
కానీ, 2017లో మాపై దాడి చేసి మమ్మల్ని చంపుతామని బెదిరించి మీ భూమి 117 కాదు 126 అని చెప్పి తమ భూమి ఎక్కడ ఉందో చూసుకోమని తమపై రంజిత్ రెడ్డితో పాటు 20 మంది గుండాలు దాడి చేసి గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆనాటి నుంచి తమను ఇబ్బందులకు గురి చేస్తూ తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారని వాపోయారు. ఈ విషయంపై గతంలో కేయూసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే అక్కడ కూడా భూమి కాగితాలు తీసుకుని రాకుండా అధికారులను తప్పుదోవ పట్టిస్తూ రంజిత్ రెడ్డి అతని తల్లి, సోదరిని ముందు పెట్టి సెంటిమెంట్ వచ్చేలా చూసుకొని తమ భూమిలోకి తమను వెళ్లకుండా ఆపుతున్నారన్నారు. తమ భూమి తమకు అప్పగించి న్యాయం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో విజయ, శ్రీలత, కొండయ్య, అనంతలక్ష్మి, మహేందర్, ధనలక్ష్మి, తనీషా, సురేష్, గణేష్, మాధవరెడ్డి, మధుసూదన్ పాల్గొన్నారు.