హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 13: నాణ్యమైన బోధనతో పాటు సమగ్ర పరిశోధన కార్యక్రమాలను కొనసాగిస్తూ విశ్వవిద్యాలయ ప్రతిష్టను మరింతగా పెంపొందించాలని కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కే.ప్రతాప్‌రెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయ బోధనా సిబ్బందికి నవంబర్ నెలలో నిర్వహించిన కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీం ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం సమక్షంలో పదోన్నతి ఉత్తర్వులను ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా ఇద్దరు ఆచార్యులకు సీనియర్ ప్రొఫెసర్ హోదాకు, తొమ్మిది మంది సహ ఆచార్యులకు ఆచార్యులుగా, 29 మంది సహాయ ఆచార్యులకు సహ ఆచార్యులుగా, ముగ్గురు సహాయ ఆచార్యులకు సెలక్షన్ గ్రేడ్ సహఆచార్యులుగా, ఇద్దరు సహాయ ఆచార్యులకు సీనియర్ స్కేల్ పదోన్నతులు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అకుట్ బాధ్యులు ఆచార్య బి.వెంకట్రామరెడ్డి, ఉప రిజిస్ట్రార్ పంజాల శ్రీధర్‌తో పాటు, ఇతర అకుట్ బాధ్యులు, అడ్మినిస్ట్రేషన్ విభాగాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.