‘ఆర్టికల్ 370’ చిత్రానికిగాను ఇటీవలే ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది కథానాయిక యామిగౌతమ్. తాజాగా ఆమె పాపులర్ బాలీవుడ్ ఫ్రాంఛైజీ ‘కహానీ’ మూడో భాగంలో నాయికగా ఖరారైంది. సుజయ్‌ఘోష్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫ్రాంఛైజీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలందుకుంది.
‘కహానీ-3’ కోసం దర్శకుడు సుజయ్‌ఘోష్ గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తొలి రెండు భాగాల్లో నటించిన విద్యాబాలన్ మూడో భాగంపై అంతగా ఆసక్తి చూపించకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌లో జాప్యం జరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ సక్సెస్ఫుల్ ఫ్రాంఛైజీలోకి యామిగౌతమ్ ఎంట్రీ ఇస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తొలి రెండు భాగాల కంటే భిన్నమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ తుదిదశకు చేరుకుందని మేకర్స్ తెలిపారు.