ఇల్లు అందంగా కనిపించాలంటే చకని రంగులు, ఆకర్షణీయమైన ఫర్నిచర్ ఉంటే సరిపోతుందని అనుకుంటాం. కానీ ఇప్పుడు ఇంటీరియర్‌లో కంటికి అందంగా కనిపించడమే కాదు.. స్పర్శతోనూ మనసును ఆకట్టుకునే అలంకరణకు ప్రాధాన్యం పెరుగుతున్నది. దీన్నే ‘టాకె్టైల్ డెకార్’ అంటారు. చూడటానికి విభిన్నంగా ఉండటంతోపాటు, తాకినప్పుడు కూడా ఓ ప్రత్యేక అనుభూతిని కలిగించే వస్తువులతో ఇంటిని తీర్చిదిద్దుతారు ఇందులో! అంటే వివిధ రకాల ఉపరితలాలు, వాటి స్పర్శతో ఇంటికి కొత్త రూపాన్ని ఇవ్వడం అన్నమాట.
ఇందులో ప్రతి అలంకరణకూ ఓ ప్రత్యేక స్పర్శ ఉంటుంది. మెత్తటి దిండ్లు, ముతకగా ఉండే నేసిన దుప్పట్లు, చెకతో చేసిన బల్లలు, మట్టి పాత్రలు, సహజమైన రాళ్లతో రూపొందించిన అలంకరణలు… ఇలా ఒకో వస్తువు ఒకో అనుభూతిని కలిగిస్తుంది. గోడలకు కేవలం రంగులు వేయకుండా, కొంత భాగంలో మట్టి పూత లేదా గరుకైన ఆకృతులతో ప్రత్యేక రూపం ఇవ్వొచ్చు. సోఫాపై వివిధ అల్లికలతో ఉన్న దిండ్లు అమర్చితే గదికి కొత్త అందం వస్తుంది. అయితే ఈ ఇంటీరియర్ ట్రెండ్‌లో సహజత్వమే ప్రత్యేకత! అందుకే ఇందులో చెక, నార, పత్తి, ఉన్ని, మట్టి, రాయి వంటి సహజ పదార్థాలకు ప్రాధాన్యం ఉంటుంది.
ఒకే రకమైన వస్తువులతో గదిని నింపకుండా, భిన్నమైన అల్లికలను కలపడం వల్ల ప్రదేశం కొత్తదనాన్ని సంతరించుకుంటుంది. మరీ ముఖ్యంగా, ఖరీదైన వస్తువులే అవసరం లేదు. చేతితో నేసిన చాప, మట్టి కుండ, చెక పీట, అల్లికలతో కూడిన తెర… మన ఇంట్లో ఇప్పటికే ఉన్నవాటితోనే ఈ శైలిని అనుసరించవచ్చు. దీని వల్ల అంతా మెరిసిపోతూ కనిపిస్తూ హైఫై లుక్ కాకుండా ఇది మనది, మన సొంతం అన్న భావన కూడా కలుగుతుందని డిజైనర్లు చెబుతున్నారు. ఇంటిని అందంగా తీర్చిదిద్దడం అంటే కంటికి విందు చేయడమే కాదు, మనసుకు హాయినిచ్చే అనుభూతులనూ ఇంట్లో భాగం చేయడం కూడా మరి!