హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం సీటు ఖాళీ అయినట్టు తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్(టీజీ సీఈవో) భారత ఎన్నికల సంఘానికి (ఈసీఐ)కి సమాచారం ఇచ్చింది. ఈ మేరకు ఈసీకి లేఖ పంపినట్టు అధికారవర్గాలు తెలిపాయి. మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతకు సంబంధించి హైకోర్టు తీర్పు నేపథ్యంలో అంతకుముందే అసెంబ్లీ కార్యాలయం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి.. 2024 ఏప్రిల్ 23 నుంచి ఖైరతాబాద్ సీటు ఖాళీగా ఉన్నట్టు ప్రకటించింది. ఇక ఉపఎన్నిక ఎప్పుడు నిర్వహించాలనేది ఈసీఐ నిర్ణయించాల్సి ఉన్నది. ఫిబ్రవరి 2027లో గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ర్టాల సాధారణ ఎన్నికలతోపాటు ఖైరతాబాద్ ఉపఎన్నికను నిర్వహించే అవకాశం ఉన్నదని అధికార వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై తుది నిర్ణయం ఎన్నికల సంఘానిదే. తెలంగాణలో కొనసాగుతున్న ‘సర్’ ప్రక్రియను పూర్తి చేసి నవంబర్ 9న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. ‘సర్’ తర్వాతే ఖైరతాబాద్ ఉపఎన్నికకు సంబంధించిన తదుపరి ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.