హనుమకొండ చౌరస్తా, మార్చి 30 : కాకతీయ విశ్వవిద్యాలయం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.331.99 కోట్లతో అంచనా బడ్జెట్‌ను ప్రతిపాదించింది. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన విశ్వవిద్యాలయ సెనెట్హాల్లో జరిగిన 41వ అకాడమిక్ సెనెట్ సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి వి.రామచంద్రం, అకాడమిక్ సెనెట్ సభ్యుల సమక్షంలో విశ్వవిద్యాలయ అర్థశాస్త్ర విభాగ ఆచార్యులు, సోషల్ సైన్సెస్, ఆర్ట్స్ విభాగాల డీన్, దూరవిద్యాకేంద్ర సంచాలకులు, పాలక మండలి సభ్యులు ఆచార్య బి.సురేష్‌లాల్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సంవత్సరం పాటు ఉద్యోగుల వేతనాలు, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లు, ఉద్యోగ విరమణ భత్యాలు, నిర్వహణ ఖర్చులు, పరీక్షలు, అబివృద్ధి కార్యక్రమాలకు, ఇతర ఖర్చులకు రూ.355.90 కోట్లు కేటాయించారు.
మొత్తం బడ్జెట్లో రాష్ర్ట ప్రభుత్వ నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రూ. 205.47 కోట్లు కాగా ఇతర వనరులు నుంచి రూ.126.52 కోట్లు రాబడి వస్తుందని అంచనా వేశారు. వీటిలో ఉన్నత విద్యామండలి నుంచి సెమినార్ల నిమిత్తం రూ.10 లక్షలు, ఇతరాల నుంచి రూ.15.50 లక్షలు, అకాడమిక్, ట్యుషన్ ఫీజుల రూపంలో రూ.8.33 కోట్లు, అంతర్గత వనురులు ద్వారా రూ.41.41 కోట్లు, ఇతర పద్దుల ద్వారా 21.56 కోట్లు, పరీక్షల విభాగం నుంచి రూ.49.64 కోట్లు ముఖ్యంగా ఉన్నాయి. ఖర్చులను, రాబడులను సురేష్‌లాల్ 8 అంశాల్లో చూపించారు. అదే సమయంలో రూ.2.16 కోట్లు లోటు ఉంటుందని వెల్లడించారు. ఉద్యోగుల జీతాలకు, పెన్షన్లకు రూ.169.96 కోట్లు, నిర్వహణ కార్యక్రమాలకు రూ.10.34 కోట్లు, పరీక్షలకు రూ.54.88 కోట్లు, అకాడమిక్ కార్యక్రమాలకు రూ.13.68 కోట్లు, అభివృద్ధి కార్యక్రమాలకు రూ.97.44 కోట్లు, అప్పులు ఇతరాలకు రూ.1.75 కోట్లు, కరువు భత్యానికి రూ.8.40 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు.
వీసీ ప్రతాప్‌రెడ్డి విశ్వవిద్యాలయ అభివృద్ధిలో అందరి కృషి ఉందని, బాధ్యతతో విశ్వవిద్యాలయాని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. 2026లో విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవ సంవత్సరంలోనికి అడుగు పెట్టిందని, ఆ సందర్భంగా అకాడమిక్ కార్యక్రమాలు (గోల్డెన్ జూబ్లీలో భాగంగా) జరుగుతున్నాయని చెప్పారు. నూతన కోర్స్‌లు జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా తీసుకోని వస్తామని, విద్యార్థులను ఉద్యోగార్ధులుగా చేయటమే లక్ష్యంగా, సిలబస్ రూపకల్పన, కృత్రిమమేధా, క్వాంటం టెక్నాలజీ పొందుపరుస్తున్నట్లు, డొమైన్ విజ్ఞానంతో పాటు సాఫ్ట్ స్కిల్ల్స్‌పై దృష్టి పెడుతున్నట్లు, క్రెడిట్ పాలసీలను కుడా అందుబాటులో తెస్తున్నట్లు, ముఖగుర్తింపు కూడా విభాగాలలో విద్యార్థులకు, హాస్టల్లో మెస్‌కు కూడా తీసుకోని వస్తున్నట్లు, విద్యార్థులు మానసిక స్థితికి తోడుగా ‘చేతనా’ అనే సెంటర్‌ను నెలకొల్పినట్లు, లైబ్రరీకి నిధులు పెంచుతున్నట్లు తెలిపారు.
అనంతరం స్టాండింగ్ కమిటీ అఫ్ అకాడమిక్ సెనెట్‌ను, వార్షిక నివేదికలను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సమావేశంలో పాలక మండలి సభ్యులతో పాటు ప్రొఫెసర్లు కట్ల రాజేందర్, ఎన్.ప్రసాద్, ఎం.సదానందం, ప్రిన్సిపాళ్లు టి.మనోహర్, జ.కృష్ణవేణి, ఎన్.రమణ, కే.భిక్షాలు, ఎస్.జ్యోతి, భాస్కర్, నల్లాని శ్రీనివాస్, గోపి, బి.ఎస్.ఎల్.సోజన్య, అకాడమిక్ సెనెట్ సభ్యులు గొల్లపూడి జగదీశ్, మాణిక్యం, ఫైనాన్సు ఆఫీసర్ మహమ్మద్ హబీబుద్దిన్, లింగంపల్లి రాము, సీహెచ్.ప్రణయకుమార్, ఆర్.శ్రీలతదేవితో పాటు, ఇతర అధికారులు పాల్గొన్నారు.