Jyothika | దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నీట్ (NEET-UG) పరీక్షల వివాదంపై కోలీవుడ్ నటి జ్యోతిక స్పందించారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, బాధ్యత ఉండాలని కోరుతూ విద్యార్థుల ఉద్యమానికి ఆమె బహిరంగ మద్దతు ప్రకటించారు. తన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్‌లో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పులు అవసరమని పేర్కొన్నారు.తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సందేశంలో “జై హింద్” అంటూ ప్రారంభించి , దేశ భవిష్యత్తు అయిన విద్యార్థుల కోసం తాను గొంతు వినిపిస్తున్నానని జ్యోతిక తెలిపారు. విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరగాలంటే పారదర్శకతతో పాటు బాధ్యతాయుతమైన చర్యలు తీసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై కూడా ఆమె విమర్శలు గుప్పించారు.
విద్యా వ్యవస్థలో చోటుచేసుకున్న పరిణామాలకు బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, విద్యార్థుల భవిష్యత్తు కోసం సంస్కరణలు అత్యవసరమని ఆమె పేర్కొన్నారు. విద్యార్థుల ఉద్యమంలో పాల్గొంటున్న సామాజిక కార్యకర్తలు సోనమ్ వాంగ్‌చుక్, అభిజిత్ దిప్కే, సౌరవ్ దాస్‌ల సేవలను జ్యోతిక ప్రశంసించారు. సుదీర్ఘకాలంగా ఉద్యమం కొనసాగిస్తూ విద్యార్థుల కోసం పోరాడుతున్న వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఒక తల్లిగా తన పిల్లలు కూడా సమాజం కోసం నిలబడే విలువలను నేర్చుకోవాలని కోరుకుంటున్నానని భావోద్వేగంగా వెల్లడించారు.
జెన్-జీ యువత భయపడకుండా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉద్యమంలో పాల్గొనడం తనకు స్ఫూర్తినిచ్చిందని జ్యోతిక అన్నారు. యువత ఐక్యంగా నిలబడి ప్రజాస్వామ్య పద్ధతిలో తమ హక్కుల కోసం పోరాడుతున్న తీరు ప్రశంసనీయమని ఆమె పేర్కొన్నారు. విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపిన ఉద్యమకారులకు కూడా ఆమె అభినందనలు తెలిపారు.కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సతీమణి అయిన జ్యోతిక సామాజిక అంశాలపై తరచూ స్పందిస్తుంటారు. విద్య, మహిళా సాధికారత, సామాజిక బాధ్యత వంటి అంశాలపై ఆమె గతంలో కూడా తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రస్తుతం చేసిన ఈ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.ఇదిలా ఉండగా, నీట్ పరీక్షల అంశంపై దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల నిరసనలు కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం.