హనుమకొండ, ఏప్రిల్ 20 : బిజెపి ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మతోన్మాద చర్యలను దూకుడుగా అమలు చేస్తుందని, ఆ విధానాలపై పోరాటం చేయాలని కార్మిక సంఘాల జిల్లా సమావేశం తీర్మానించింది. రామనగర్ లోని సుందరయ్య భవన్ లో ఆదివారం సిఐటియు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ అధ్యక్షతన జాతీయ కార్మిక సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి జక్కుల రాజు గౌడ్, ఐఎఫ్టియు జిల్లా నాయకులు నున్న అప్పారావు, ఏఐసిటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్మెస్ రావు, టిఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్యాంసుందర్, ఐఎన్టియుసి జిల్లా నాయకులు మైముదా మాట్లాడుతూ కార్మికులు 100 సంవత్సరాల క్రితం పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్ లను చట్టం చేసి అమల్లోకి తీసుకువచ్చేందుకు బిజెపి ప్రభుత్వం సిద్ధం అయిందన్నారు.
దీనికి వ్యతిరేకంగా గత ఐదు సంవత్సరాలుగా కార్మిక వర్గం చేస్తున్న ఆందోళన పోరాటాలను అనిచి వేస్తూ కార్మిక హక్కులను కాల రాస్తుందని వారు విమర్శించారు. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించుకునేందుకు కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు అసోసియేషన్లు కలిసి మే 20న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. దానిని జయప్రదం చేయడం కోసం ఈనెల 27వ తేదీన కాకతీయ యూనివర్సిటీలో జిల్లా సదస్సును నిర్వహిస్తున్నట్లు దానిని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు టీ ఉప్పలయ్య, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు వేల్పుల సారంగపాణి, కార్మిక సంఘాల నాయకులు పుల్ల అశోక్,ఎన్ రజిత, గుంటి రాజేందర్, ఆర్ కుమార్, మంద మల్లేశం, డి భాను నాయక్, ఆర్ దుర్గాప్రసాద్,ఏ మల్లయ్య ఆర్ వంశీ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.