హనుమకొండ చౌరస్తా, జనవరి 5: 2024 సంవత్సరం నుంచి ఉద్యోగవిరమణ పొందిన ఉపాధ్యాయులు, ఉద్యోగుల పెన్షనరీ, రిటైర్మెంట్ ప్రయోజనాల వెంటనే విడుదల చేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీధర్ల ధర్మేంద్ర, కడారి భోగేశ్వర్ డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన సందర్భంగా ఉపాధ్యాయులను, ఉద్యోగులను ఇంటివద్దనే అరెస్టులు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పెండింగ్లో ఉన్న ఆర్థిక బిల్లులను విడుదల చేయకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలకు పిలుపునిచ్చిన వారిని అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. అరెస్టు చేసినవారిని వెంటనే పోలీస్ స్టేషన్ల నుంచి విడుదల చేయాలని, ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగులో ఉన్న బిల్లులను, డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఉటుకూరి అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ.వీరస్వామి కూడా ఖండించారు.