ఖిలావరంగల్, జనవరి 09 : సత్యసాయి శత జయంతి వేడుకలలో భాగంగా ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభమైన శోభయాత్ర శుక్రవారం వరంగల్ నగరంలో ప్రవేశించింది. శివనగర్‌లోని సత్యసాయి మందిరం నుంచి ఉదయం రథయాత్ర అధికారికంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన రథయాత్రలో సత్యసాయి బోధనలను ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో భక్త బృందం సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సందేశాలు అందించారు.
ప్రేమ, సేవ, మానవత్వం వంటి విలువలను ప్రతిబింబించే ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శివనగర్ నుంచి ప్రారంభమైన శోభయాత్ర అండర్‌బ్రిడ్జి, చౌరస్తా, పోచమ్మ మైదానం, ఎంజీఎం కూడలి, హనంకొండ, కాజీపేట మీదుగా కరీంనగర్ వైపు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా సత్యసాయి సేవాసమితి జిల్లా అధ్యక్షులు గండి వెంకటేశ్వర్ మాట్లాడుతూ, ప్రేమ, దయ, మానవత్వం, సేవ వంటి సత్యసాయి సద్గుణాలు నేటి సమాజానికి అత్యవసరమని అన్నారు.
సత్యసాయి బోధనలు ప్రతి ఒక్కరి జీవితంలో ఆచరణీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ సత్యసాయి సమితి అధ్యక్షులు రాజేశ్వర్ రావు, హనంకొండ సమితి అధ్యక్షులు వీరమల్ల కైలాష్, సుమతి నాయుడు, మాజీ కార్పొరేటర్ శామంతుల ఉష, సువర్ణ, నరేష్, అరుణ, బుదారపు భాస్కర్, యాదగిరి, రాజు తదితరులు పాల్గొన్నారు.