బచ్చన్నపేట, మార్చి 25 : జనగామ డిపో మేనేజర్ పరిస్థితి కూట్లో రాయి తియ్యలేనోడు ఏట్లో తీసిన చందంగా ఉందని బచ్చన్నపేట మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. జనగామ జిల్లాలో పలు ప్రాంతాలకు బస్సులను నడిపించే శక్తి లేదు కానీ గత కొంత కాలంగా బచ్చన్నపేట పరిసర ప్రాంతాల ప్రజలకు జగద్గిరిగుట్ట నుంచి బచ్చన్నపేట వరకు ఉదయం నుంచి రాత్రి వరకు పలు ట్రిప్ లను నడుపుతూ రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు ప్రయాణికుల విలువైన సమయాన్ని వృథా కాకుండా సేవలు అందిస్తున్న తరుణంలో కూకట్ పల్లి డిపో బస్సు లను నడపకుండా అడ్డుకుంటూ రాక్షస ఆనందం పొందుతున్నారని అగ్రహం వ్యక్తం చేసారు.
కూకట్ పల్లి బస్సులను రాకుండా చేసి బచ్చన్నపేట ప్రజల మెరుగైన రవాణా సౌకర్యాలను హరించివేస్తున్న డీఏం వైఖరి హేయమైన చర్యగా అభివర్ణించారు. సంవత్సరం పైగా బస్సులు నడిపిస్తుంటే ఇప్పుడు మేల్కొని జనగామ డిపో పరిధిలో బచ్చన్నపేట ఉంది కాబట్టి మేమే బస్సులు నడుపుతామనే జనగామ డిపో మేనేజర్ వైఖరిని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. తమకు జనగామ డిపో బస్సులు వద్దు కూకట్ పల్లి డిపో బస్సులు కావాలని సంబంధిత మంత్రికి, చైర్మన్, ఎండీని మండల ప్రజలు కోరుతున్నారు.