రాష్ట్రంలో పచ్చదనం పెంచడమే లక్ష్యంగా సర్కారు చేపట్టిన హరితహారం సత్ఫలితాలు ఇస్తున్నది. పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఈ క్రమంలో తొమ్మిదో విడుత హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు హనుమకొండ జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. సర్కారు నిర్దేశించిన లక్ష్యం 22.45 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. జిల్లాలోని 243 నర్సరీల్లో మొక్కలను పెంచుతుండగా, శాఖల వారీగా టార్గెట్ నిర్ణయించి వర్షాలు ఊపందుకోగానే నాటేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. కొత్తగా సంపద వనాలు ఏర్పాటు చేసి వెదురు, నార వేప, వేప లాంటి కర్ర జాతుల మొక్కలను పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు.
హనుమకొండ, జూలై 1 : హరితోద్యమానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. ‘ఖాళీ, సర్కారు స్థలాల్లో నాటిన మొక్కలు మహా వృక్షాలు కావాలి. తెలంగాణ పచ్చదనంతో పరిఢవిల్లాలి. ప్రతి జిల్లా, పల్లె, పట్టణం పచ్చదనంతో నిండాలి. ప్రతి ఇల్లు మొక్కల పొదరిల్లు కావాలి. ఆహ్లాదకర వాతావరణంతో పల్లెలు కళకళలాడాలి. ప్రజలను పచ్చందాలు మురిపించాలి. బాటసారులు, రైతులు సేద తీరేందుకు వృక్షాలు నీడ ఇవ్వాలి. కాలుష్యాన్ని తరిమికొట్టి మానవాళికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి.’ అనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం హరిహారం కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఇప్పటి వరకు ఎనిమిది విడుతలు విజయవంతంగా పూర్తవ్వగా తొమ్మిదో విడుత చేపట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నది. జిల్లాలోని 208 గ్రామ పంచాయతీల పరిధిలో 243 నర్సరీలు ఏర్పా టు చేసి మొక్కలను పెంచారు. ఇప్పటికే గుంతలు తీసే కార్యక్రమం ప్రారంభించామని, వర్షం పడగానే మొక్కలు నాటుతామని సంబంధిత శాఖల అధికారులు తెలిపారు. కాగా, ఈ సారి సంపద వనాల ఏర్పాటుతో పాటు ఇరిగేషన్ భూములు, కెనాల్ కట్టలపై మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసారు.
హనుమకొండ జిల్లాలో తొమ్మిదో విడుత హరితహారం కార్యక్రమంలో 22.45లక్షల మొక్కలు నాటాలని రాష్ట్ర సర్కారు లక్ష్యం నిర్దేశించింది. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆయా శాఖలు తమ కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. సీం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా 2015లో ప్రారంభించిన హరితహారం కార్యక్రమంతో ఇప్పటికే పల్లెలు, పట్టణాలు పచ్చగా దర్శనమిస్తున్నాయి. ఈ విడుతలో గతంలో ఇచ్చిన మొక్కలతో పాటు పండ్లు, ఆయిల్‌పామ్, కలప మొక్కలు, నీడ ఇచ్చే మొక్కలను అందజేయనున్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో 208, అటవీ శాఖ 4, జీడబ్ల్యూఎంసీ 26, కుడా 4, పరకాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఒకటి చొప్పున మొత్తం 243 నర్సరీల్లో మొక్కలను పెంచారు.
తొమ్మిదో విడుత హరితహారంలో 28 శాఖల ఆధ్వర్యంలో మొక్కలు నాటేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. వీటిలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో 8లక్షలు, కుడా 2లక్షలు, జీడబ్ల్యూఎంసీ 8లక్షలు, పరకాల మున్సిపాలిటీ లక్ష, అటవీ శాఖ 15వేలు, వ్యవసాయ శాఖ 20వేలు, హార్టికల్చర్ 50వేలు, సెరీ కల్చర్ 1.60లక్షలు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ 30వేలు, జిల్లా విద్యా శాఖ 10వేలు, ఆర్ అండ్ బీ 500, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 13,200, దేవాదాయ శాఖ వెయ్యి, రైల్వే శాఖ వెయ్యి, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 5వేలు, వైద్యారోగ్య శాఖ 2వేలు, మార్కెటింగ్ శాఖ వెయ్యి, ట్రైబల్ వెల్ఫేర్ 500, మైనార్టీ వెల్ఫేర్ 500, పోలీస్ డిపార్ట్మెంట్ 10వేలు, సోషల్ వెల్ఫేర్ 500, బీసీ వెల్ఫేర్ 500, ఆర్టీసీ 500, జోనల్ మేనేజర్ టీఎస్ఐఐసీ 20వేలు, జిల్లా సంక్షేమ శాఖ 3వేలు, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ 500, ఫిషరీస్ 500, పశుసంవర్థక శాఖ అధికారులు, సిబ్బంది 500 మొక్కలు నాటనున్నారు.
హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడంతో పాటు మొక్కల సంరక్షణే లక్ష్యంగా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం రా్రష్ట్ర ప్రభుత్వ హరితనిధి ఏర్పాటు చేసింది. అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రతి సంవత్సరం నిధులను సేకరిస్తున్నది. మొక్కలను సంరక్షించే బాధ్యతను జీపీలకు గతంలో ఉన్న మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలకు పెంచినట్లు డీఆర్డీఏ అధికారులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ సారి కొత్తగా ‘సంపద’ వనాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ పంచాయతీలకు ఆదా యం సమకూర్చడమే లక్ష్యంగా ఈ సంపద వనాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. వెదురు, నార వేప, వేప, శిసు లాంటి కర్రకు సంబంధించిన మొక్కలతో పాటు సీతాఫలం, నేరేడు, ఉసిరి లాంటి పండ్ల మొక్కలను నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాలోని ధర్మసాగర్లో మూడు ఎకరాల స్థలంలో సంపద వనాన్ని ప్రారంభించారు.
జిల్లాలో తొమ్మిదో విడుత హరితహారం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో గుంతలు తీశాం. వర్షాలు పడగానే మొక్కలు నాటడం ప్రారంభిస్తాం. జిల్లా లక్ష్యమైన 22.45 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నాం. మొక్కలు ఎవరు అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. 208 జీపీల పరిధిలో సుమారు 243 నర్సరీల్లో మొక్కలు పెంచాం. ఈ సారి ఎక్కువగా పండ్లు, కలప, నీడను ఇచ్చే మొక్కలు ఇవ్వనున్నాం. కొత్తగా రైతులకు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను అందజేస్తున్నాం.
-ఏ శ్రీనివాస్‌కుమార్, డీఆర్డీవో, హనుమకొండ జిల్లా