మడికొండ : కోచ్ ఫ్యాక్టరీలో యువతకు ఉపాధి కల్పించాలని సీపీఐ రాష్ర్ట సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మడికొండలోని సీపీఐ కాజీపేట మండల మహాసభ నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ రైల్వే కోచ్ ఫ్యాక్టరీతో పాటు కాజీపేట రైల్వే డివిజన్ అభివృద్ధి కోసం సీపీఐ పోరాడిందన్నారు. కాజీపేట రైల్వే డివిజన్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. అలాగే మడికొండ శివారులోని డంపింగ్‌యార్డును తొలగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
దీంతో గాలి కలుషితమవుతోందని, దుర్వాసనతో జీవనం సాగిస్తున్న ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ర్ట కౌన్సిల్ సభ్యులు ఆదరి శ్రీనివాస్, అశోక్, స్టాలిన్, జిల్లా సహాయ కార్యదర్శి తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్, మండల కార్యదర్శి మునిగా భిక్షపతి, నాయకులు మాలోతు శంకర్, నేదునూరి వెంకటరాజం, కొట్టెపాక రవి తదితరులు పాల్గొన్నారు.