హనుమకొండ, అక్టోబర్ 6 : మూడు దశాబ్దాలుగా అలుపెరుగని పోరాటం చేసి సాధించుకున్న మన జాతి ఆశయమైన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను విద్యా, ఉద్యోగ రంగాల్లోని అన్ని డిపార్ట్మెంట్లలో వర్తింపజేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ మ్యాథమాటిక్స్డిపార్ట్మెంట్ సెమినార్‌హాల్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా మాదిగ ఉద్యోగుల సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఏ వర్గాల అంశాలు పెండింగ్‌లో ఉన్నాయో, ఏ సమస్యలు పరిష్కారం కాలేదో, ఆ వాయిస్‌లేని వర్గాల పక్షాన నిలబడి బలమైన పోరాటాలు నడిపి ఎమ్మార్పీఎస్ విజయాలు సాధించిందన్నారు.
ప్రభుత్వం విడుదల చేస్తున్న ఉద్యోగాలు, ప్రమోషన్లు, వివిధ డిపార్ట్మెంట్ల అడ్మిషన్ల విషయంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ రోస్టర్ విధానం పాటించకుండా చేస్తున్న అన్యాయాన్ని సరిదిద్ది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రకారమే అన్ని ఉద్యోగ నియామకాలు, ప్రమోషన్లను చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మనోహర్, ఎంఈఎఫ్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి బొడ్డు దయాకర్, హాస్టల్ డైరెక్టర్ రాజ్‌కుమార్, బీసీ నాయకులు తాండూరి శాస్త్రి, పుల్ల శ్రీనివాస్, నాయకులు దనయ్య, సంకినేని వెంకట్ తదితరులు పాల్గొన్నారు.