వేలేరు : వేలేరు గ్రామాభివృద్ధియే లక్ష్యంగా కృషి చేస్తున్నామని స్థానిక సర్పంచ్ బిల్లా యాదగిరి అన్నారు. హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో రూ.30 లక్షలతో అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులను యాదగిరి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంట త్వరలోనే సైడ్ డ్రైనేజీ నిర్మాణానికి కృషి చేస్తున్నామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
అలాగే వేలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు రూ.22లక్షలతో ప్రహరీ నిర్మాణం, రూ.10లక్షలతో వీఓ మహిళ భవన నిర్మాణానికి నిధులు మంజూరు కాగా పనులు ప్రారంభించినట్లు సర్పంచ్ యాదగిరి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీకర్, జీపీ సెక్రటరీ రవికుమార్, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.