హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 13: కాకతీయ యూనివర్సిటీ రాజనీతిశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘భారతదేశంలో సరళీకరణ అనంతరం జనరంజక విధానాలు’ అనే అంశంపై కేయూ సెనెట్ హాల్లో ఈనెల 16, 17 తేదీలలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థి మేధావులు, ప్రజాస్వామికవాదులు హాజరై విజయవంతం చేయాలని సెమినార్ డైరెక్టర్ అండ్ కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం పిలుపునిచ్చారు. శుక్రవారం కేయూ రాజనీతిశాస్త్రం విభాగంలో విద్యార్థులు, స్కాలర్స్, పూర్వవిద్యార్థులతో జాతీయ సెమినార్ విజయవంతం కోసం సన్నాహాక సమావేశం నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన వి.రామచంద్రం మాట్లాడుతూ.. రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించే ఈ జాతీయ సదస్సుకు ముఖ్యఅతిథిగా తెలంగాణ ఉన్నతవిద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, ప్రధాన వక్తగా ప్రముఖ సామాజిక తత్వవేత్త ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య, ప్రముఖ పత్రిక సంపాదకులు, విశ్లేషకులు కే.శ్రీనివాస్, ఎన్.వేణుగోపాల్ హాజరవుతున్నారని తెలిపారు. సమావేశంలో రాజానీతీశాస్త్ర విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గడ్డం కృష్ణయ్య, అధ్యాపకులు వడ్లకొండ సత్యనారాయణ, వాడపల్లి నాగరాజు, రీసెర్చ్ స్కాలర్ బి.నరసింహారావు, జెట్టి రాజేందర్, జి.సురేష్, రుబీనా, కల్లేపెళ్లి ప్రశాంత్ పాల్గొన్నారు.