హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 25: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెలల పసిబిడ్డను అత్యంత క్రూరంగా కాలితో తన్ని హత్య చేసిన ఆ గ్రామ అగ్రకుల పెత్తందారులు శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, సతీష్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కన్నిరెడ్డి, తుకారం రెడ్డిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని బహుజన చాకలి అయిలమ్మ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రావుల సుదర్శన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో సేవా కులాలపై దుశ్చర్యలకు పాల్పడుతున్న అగ్రవర్ణాల హంతకులందరినీ వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
అగ్రకుల దురహంకారంతో ప్రజల మధ్య కులవిద్వేశాలు సృష్టించడం, దేవుడి దగ్గర అందరూ సమానం కాదని అహంకారం ప్రదర్శించడం వలన ఈ ఘటన జరిగిందన్నారు. దేవుడి దగ్గరకు వెళ్లడానికి రూ.100 రుసుం ఎందుకు చెల్లించాలని ప్రశ్నించిన పాపానికి, చెల్లిస్తాం కానీ రశీదు ఇవ్వండని అడిగినందుకు సుమారు మూడున్నరగంటల పాటు గణేష్ అనే రజక యువకుడిని చితకబాదారని మండిపడ్డారు.
తన భర్తను కొట్టవద్దని, తన తమ్ముడిని కొట్టవద్దని గణేష్ అక్క కీర్తి భార్య మౌనిక ఎంత బతిమిలాడినా కాళ్లు మొక్కడానికి ప్రయత్నం చేసినా కాళ్లతో తన్నారు తప్ప కనికరించలేదన్నారు. సీఎం నోరు విప్పాలని వెంటనే హత్యానేరం కింద 103 సెక్షన్ పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాలడుగుల సురేందర్, పారుపల్లి రవికుమార్, నాగపూరి సంతోష్, హరి, సుంకరి రాజు, చీకటి శ్రీనివాస్, గణేష్ పాల్గొన్నారు.