భీమదేవరపల్లి, మార్చి 25: సిద్దిపేట – హనుమకొండ ప్రధాన రహదారిపై రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా ముల్కనూరులోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించ వద్దంటూ దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు వెడల్పు పనుల్లో బీఆర్ అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ అమరవీరుల స్తూపం తొలగించేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి ఆర్టీసీ కాంపౌండ్ లో నెలకొల్పుతారని ఆర్టీసీ అధికారులకు తెలిసింది. దీంతో గత రెండు రోజులుగా బస్టాండ్ వద్ద ఆర్టీసీ పోలీసులు, అధికారులు పహారా కాస్తున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ కాంపౌండ్ లో ఎవరి విగ్రహాలు భద్రపరిచేందుకు కూడా అంగీకరించమని కరీంనగర్ డిప్యూటీ ఆర్ఎం భూపతిరెడ్డి తేల్చి చెప్పారు. రహదారి పనుల్లో అంబేద్కర్ విగ్రహం తొలగించ వద్దని దళిత సంఘాల నాయకులు డ్యాగల సారయ్య, చెప్యాల ప్రకాష్, తూముల సదానందం, మేకల చేరాలు, మాడుగుల అశోక్ తదితరులు తహశీల్దార్ ప్రవీణ్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. కాగా ఆర్టీసీ కాంపౌండ్ లో విగ్రహాలు పెట్టకుండా ఉండేందుకు అధికారులు బస్టాండ్ బిల్డింగ్ పైననే పహారా కాస్తూ, రాత్రిళ్లు నిద్రించడం విశేషం.