Hanumakonda | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 18 : పాఠశాల ముందు మద్యం షాపు వద్దంటూ కాలనీవాసులు రోడ్డెక్కారు. హనుమకొండ యాదవనగర్ మూలమలుపు వద్ద నూతనంగా వైన్‌షాపు ఏర్పాటు చేస్తుండడంతో కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై ప్లకార్డులతో నిరసన చేపట్టారు. కేయూకు వెళ్లే ప్రధాన రహదారిలో నిరసన తెలిపారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎదుట వైన్స్‌షాపు ఏర్పాటు చేయవద్దని కాలనీవాసులు నినాదాలు చేశారు. మూలమలుపు వద్ద వైన్స్ ఓపెన్ చేస్తే యాదవనగర్, క్రిష్ణాకాలనీ, న్యూరెడ్డికాలనీ ప్రజలు ప్రమాదాల బారిన పడతారని కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. వెంటనే అధికారులు స్పందించి ఇక్కడ వైన్‌షాపు ఏర్పాటు చేయకుండా చూడాలని హెచ్చరించారు. కాలనీవాసుల రాస్తారోకో సుమారు అరగంటసేపు ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళన సమాచారాన్ని పోలీసులకు అందించడంతో మా పరిధి కాదంటూ కేయూ పోలీసులు హనుమకొండ పోలీస్‌స్టేషన్‌కు వస్తుందని అరగంట తర్వాత అక్కడికి హనుమకొండ పోలీసులు చేరుకుని కాలనీవాసులను సముదాయించి ఆందోళన విరమింపజేశారు.