హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 14: హనుమకొండ కుమార్పల్లి విజన్ ప్లే స్కూల్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ హాజరై విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించేలా సందేశం అందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దీప్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సుమారు 25 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శిస్తూ దేశభక్తి నినాదాలు చేశారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగురవేస్తామని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రతిజ్ఞ చేశారు. జాతీయజెండా పట్ల గౌరవం, దేశభక్తి ప్రతి ఒక్కరిలో పెంపొందాలని, ప్రతి ఇంటా జాతీయ జెండా రెపరెపలాడేలా ప్రజలు భాగస్వాములు కావాలని నిమ్మల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కార్యక్రమం దేశభక్తి నినాదాలతో ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో టీచర్ల అంజుమ్ బేగం, నుస్రత్, ఫర్హాన, జోత్స్న, యమున, వైష్ణవి పాల్గొన్నారు.