హనుమకొండ రస్తా, అక్టోబర్ 12 : ‘రూరల్ క్రికెట్ ఆన్ గ్లోబల్ వికెట్’ అనే లక్ష్యంతో హైదరాబాద్లోని ఐఎంఏ భవన్లో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొత్త అపెక్స్కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించగా హనుమకొండకు చెందిన డాక్టర్ పెసరు విజయచందర్రెడ్డి టీసీఏలో కోశాధికారిగా కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన ఏకగ్రీవంగా టీసీఏ రాష్ట్రఉపాధ్యక్షుడిగా ఎన్నికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ పెసరు విజయచందర్రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధి దిశగా మరింత దృష్టి సారిస్తామని, పట్టణాలకే పరిమితమైన క్రీడా అవకాశాలను గ్రామాలకు విస్తరించడం మా ప్రధాన సంకల్పమన్నారు.
గ్రామీణ ప్రాంతాల యువక్రీడాకారులకు శిక్షణా సదుపాయాలు, మౌళిక వసతులు, రాష్ట్రస్థాయి గుర్తింపు లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ‘రూరల్ క్రికెట్ ఆన్ గ్లోబల్ వికెట్’ అనే ధ్యేయంతో తెలంగాణలో ప్రతిభావంతులైన యువతను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించడమే మా లక్ష్యమని చెప్పారు. ఈ సందర్భంగా టీసీఏ సభ్యులు, క్రీడాభిమానులు, ప్రతినిధులు విజయచందర్రెడ్డికి అభినందనలు తెలిపారు. కొత్త బాధ్యతల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.