ధర్మసాగర్ : పదవ తరగతి లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బాలిక విద్యార్థులకు పందిళ్ళ సుచేత ప్రతిభా పురస్కారాలు అందించనున్నట్లు నమస్తే తెలంగాణ వరంగల్ యూనిట్ బ్రాంచ్ మేనేజర్ పందిళ్ల అశోక్ కుమార్ తెలిపారు. ఇటీవల అశోక్ కుమార్ తల్లి పందిళ్ల సుచేత మరణించారు. కాగా, వారి తల్లి పందిళ్ల సుచేత జ్ఞాపకార్థం ప్రతి యేటా ప్రతిభా పురస్కారాలు అందించనున్నట్లు బుధవారం ధర్మసాగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా పదవ తరగతి లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులకు ప్రతి సంవత్సరం ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించనున్నట్లు తెలిపారు.
ప్రథమ బహుమతి రూ.5వేలు, ద్వితీయ బహుమతి రూ.3వేలు, తృతీయ బహుమతి రూ.2వేలతో పాటు మెమెంటో, శాలువ తో సత్కరించనున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ప్రతిభా పురస్కారాలు అందిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రతిభా పురస్కారాలు అందుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం మురళి, స్థానిక సర్పంచ్ మాచర్ల జ్యోతి, ఉపసర్పంచ్ కొంతం కొమురమ్మ, నాయకులు గుర్రపు ప్రసాద్, రొండి రాజు, కునూరు రాజు, దుర్గయ్య, కొలిపాక రమేష్, డాక్టర్ రామరావు తదితరులు పాల్గొన్నారు