హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 11: క్రీడా స్ఫూర్తితో ఉద్యోగుల్లో ఉత్సాహం, టీమ్ స్పిరిట్‌కు ప్రోత్సాహమని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. ఎన్పీడీసీఎల్లో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో భాగంగా సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి మంగళవారం హనుమకొండ రెడ్డిపురంలోని క్రికెట్ గ్రౌండ్ లో ఉద్యోగులు, క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఉద్యోగులతో కలిసిమెలిసి క్రికెట్ ఆడిన సీఎండీ, క్రీడాకారులను అభినందిస్తూ వారిని మరింత ఉత్సాహపరిచారు. ఉద్యోగులతో స్నేహపూర్వక వాతావరణంలో గడిపారు.
క్రీడలు కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసం, పరస్పర అనుబంధం, నాయకత్వ లక్షణాలు, సమన్వయం, టీమ్ స్పిరిట్ ను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని సీఎండీ అన్నారు. సంస్థ అభివృద్ధికి ప్రతి ఉద్యోగి ఒక టీమ్ గా సమైక్య భావంతో పనిచేయాలని, ఉద్యోగుల ఆరోగ్యం సంస్థ తరఫున మరింత ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎండీ తెలిపారు. సీఎండీ స్వయంగా క్రీడల్లో పాల్గొనడం ఉద్యోగులు, క్రీడాకారుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా ఉద్యోగులు, క్రీడాకారులు సీఎండీతో కలిసి క్రీడల్లో పాల్గొనడం తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.