Konijeti Rosaiah | హనుమకొండ, జులై 04: శాంత స్వభావం, పాలనా నైపుణ్యానికి ప్రతిరూపం మాజీ సీఎం కొణిజేటి రోశయ్య అని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి కీర్తించారు. రోశయ్య 92వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ భవన్లో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎండీ ముందుగా రోశయ్య చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. రోశయ్య సౌమ్యత, విషయ స్పష్టతతో ఏ పనినైనా నిబద్ధతతో చేసేవారని తెలిపారు. ఆయన రాజకీయ జీవితం సహనం, నిష్పక్షపాత, ప్రజా సంక్షేమం కోసం పాటుబడ్డారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘ కాలం ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఘనత రోశయ్యదేనని వెల్లడించారు. ఒక మహోన్నత వ్యక్తి, చమత్కారాలు, ఛలోక్తులు విసరటంలో సరిసాటి అని తెలిపారు. రోశయ్య నైతిక విలువలతో కూడిన నాయకత్వం, ప్రజల పట్ల మమకారంతో నిండిన సేవా జీవితం గల మహానాయకుడని, ఆయన జీవితం భావితరాలకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు’