హనుమకొండ చౌరస్తా, మార్చి 6: కాంగ్రెస్ ముస్లిం మేనిఫెస్టో ప్రకారం ఇమామ్ మౌజాస్ కి జీతం పెంపుదల అమలు చేయకపోవడం చాలా బాధాకరమని, జీతాలు పెంచకపోవడంకాక, గత నాలుగు నెలలుగా గౌరవ వేతనం రాక, పవిత్ర రంజాన్ మాసంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ నయీముద్దీన్ అన్నారు.
గురువారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సంవత్సరం నుండి దావత్ – ఏ – ఇఫ్తార్ ఏర్పాట్లు లేవు, బడ్జెట్ కేటాయింపు లేదు, రంజాన్ తోఫా లేదని కాంగ్రెస్ తీరుపై నయీముద్దీన్ మండిపడ్డారు. ఈ సంవత్సరం నుంచైనా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యుల ఫోరమ్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ మొహీబుద్దీస్, జిల్లా నాయకులు లాల్ మహ్మద్, ఇక్బాల్, ఇస్మాయిల్ పాల్గొన్నారు.