హనుమకొండ చౌరస్తా, జనవరి 18: మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, అయినప్పటికీ వారిపై దాడులు, దౌర్జన్యాలు తగ్గడం లేదు. మనువాదపు భావజాలం కారణంగా మహిళలపై రోజు రోజుకు దాడులు పెరుగుతున్నాయని, వాటిని వ్యతిరేకించాలని ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి నలిగంటి రత్నమాల అన్నారు. హనుమకొండ రాంనగర్లోని ఐద్వా హనుమకొండ జిల్లా కార్యాలయంలో ఐద్వా 14వ జాతీయ మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన ‘మహిళలు సాధికారత అంశం’పై రౌండ్ టేబుల్ సమావేశం ఐద్వా హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎం.రమాదేవి, టి.భవానీ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంవగా రత్నమాల మాట్లాడుతూ ఐద్వా పోరాటాల ఫలితంగా మహిళలకు అనేక చట్టాలు, హక్కులు లభించాయన్నారు. గుజరాత్లో బిల్కిస్ బానో కుటుంబానికి అండగా నిలిచి పోరాడి నిందితులను తిరిగి జైలుకు పంపించడంలో ఐద్వా పాత్ర చారిత్రకమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 33శాతం మహిళా రిజర్వేషన్ చట్టం అమలులో విఫలమైందని ఆరోపించారు. వెంటనే చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈనెల 25న జరగనున్న బహిరంగ సభకు జాతీయ నాయకులు హాజరవుతారని, అధిక సంఖ్యలో మహిళలు జిల్లా నుండి పాల్గొని మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఐద్వా హనుమకొండ జిల్లా కార్యదర్శి ఎల్.దీప, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు ఏ.రామతారా, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.చుక్కయ్య, సిఐటియు జిల్లా అధ్యక్షులు టి.ఉప్పలయ్య, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు ఓరుగంటి సాంబయ్య, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.తిరుపతి, ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు స్టాలిన్, శ్రీకాంత్, మత్స్య కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గొడుగు వెంకట్, గొర్రెలమేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి కె.లింగన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి.రాములు, శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ ఎం.రజిత, ఐద్వా వరంగల్ జిల్లా నాయకురాలు భవాని, సువర్ణ, మయూరి, రజిత, ప్రజాసంఘాల జిల్లా బాధ్యులు పాల్గొన్నారు.