భీమదేవరపల్లి, జూన్ 18: ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం ఐదు డైరెక్టర్ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి కోదండరాములు ప్రకటించారు. బుధవారం ముల్కనూరు సహకార సంఘం ప్రధాన కార్యాలయంలో ఎన్నికల నామినేషన్ పత్రాల ఉపసంహరణ ముగిసింది. ముల్కనూర్ సహకార సంఘంలో మొత్తం 15 డైరెక్టర్ స్థానాలు ఉండగా 1, 2, 5, 9, 15 స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నెల 16వ తేదీన నామినేషన్ల స్వీకరణలో భాగంగా ఒకటో డైరెక్టర్ స్థానంలో అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, దొంగల చిన్న వెంకట్రాజం, రెండో స్థానంలో బొల్లంపల్లి కుమారస్వామి, కడారి ఆదాం, ఐదోస్థానంలో గణవేన శ్రీనివాస్, కూన కనుకయ్య, తొమ్మిదో స్థానంలో గుర్రాల భాస్కర్ రెడ్డి, మార్పాటి జయపాల్ రెడ్డి, బోయినపల్లి రత్నాకర్ రావు, 15లో కాశిరెడ్డి వసంత, కంకల భాగ్య నామినేషన్ దాఖలు చేశారు.
కాగా, బుధవారం దొంగల చిన్న వెంకట్రాజం, కడారి ఆదాం, కూన కనకయ్య, మార్పాటి జయపాల్ రెడ్డి, బోయినపల్లి రత్నాకర్ రావు, కంకల భాగ్య తమ నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్నారు. దీంతో ముల్కనూరు సహకార సంఘం ఐదు డైరెక్టర్ స్థానాల ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, బొల్లంపల్లి కుమారస్వామి, గణవేన శ్రీనివాస్, గుర్రాల భాస్కర్ రెడ్డి, కాశిరెడ్డి వసంత ఏకగ్రీవమైనట్లు తెలిపారు. ఈనెల 30వ తేదీన ముల్కనూరు సహకార సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల అధికారి కోదండ రాములు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లతో కలిసి పాలకవర్గం, రైతులు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.