హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 7: చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు సాధిస్తామని వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం వారు దేవాలయాన్ని సందర్శించి స్వామివారికి పూజలు నిర్వహించుకొని ఆలయ నాట్యమంటపంలో ఆలయ ఈవో డి.అనిల్‌కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఆలయ సిబ్బంది స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం కేంద్ర టూరిజం పురావస్తుశాఖ విడుదల చేసిన రూ.14.14 కోట్లు ఏ పనులకు వినియోగిస్తారో కేంద్ర పురావస్తుశాఖ జిల్లా అధికారి అజిత్‌ను అడిగి తెలుసుకున్నారు. కళ్యాణ మండపంలోని దక్షణ దిశలో ఉన్న 5 శాతం పనులు, నందీశ్వరునిపై మంటపం, ప్రదక్షణ పథం కింద 3 లేయర్లు, వెలికితీసి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, సెంట్రల్ లైటింగ్, భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు గార్డెన్, కోనేరు పునరుద్దరణ, లైటింగ్, టాయిలెట్స్, భక్తులు, పాదాచారులకు, ఫుట్‌వే, వసతులు ఏర్పాటు చేస్తామని కేంద్ర పురావస్తుశాఖ డైరెక్టర్ జనరల్ నుంచి లెటర్ ఇచ్చారన్నారు.
2012లో ముందుభాగం అభివృద్ధికి రూ.30 కోట్లు కేటాయించగా అందులో రూ.10 కోట్లు పెట్టి సుందరీకరణ, గార్డెన్ ఏర్పాటు చేసినట్లు ఇంకా రూ.20 కోట్ల బడ్జెట్లో నిల్వ ఉన్నదని కుడా ఆధ్వర్యంలో గుడిచుట్టూ ఉన్న గృహయజమానులతో, కుడా అధికారులు చర్చలు జరుపుతున్నారని, గృహాలు కోల్పోయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లింపులు చేసి తొలిగించడం వలన యునెస్కో గుర్తింపు వచ్చే అవకాశం ఉందని, ఆ ప్రక్రియ ప్రారంభమైందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. గృహయజమానులు సహకరించాలని, ప్రభుత్వం ఇచ్చే నిధులతో వేరే ప్రాంతంలో గృహాలు నిర్మించుకోవడం ఉత్తమమని ఆయన అన్నారు. అర్చకులు గంగు మణికంఠశర్మ, సందీప్‌శర్మ, ప్రణవ్‌శర్మ, సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.