Kakatiya University | హనుమకొండ చౌరస్తా, జనవరి 17 : తెలంగాణ ప్రభుత్వం వారసత్వ శాఖ-కాకతీయ విశ్వవిద్యాలయం చరిత్ర, పర్యాటక నిర్వహణ విభాగం మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ అవగాహన ఒప్పంద పత్రాల మార్పిడి హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, కాకతీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి సమక్షంలో జరిగింది. విశ్వవిద్యాలయం తరఫున రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం, వారసత్వ శాఖ తరఫున డైరెక్టర్ ప్రొఫెసర్ కుతాడి అర్జునరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఆతిథ్య, పర్యాటక రంగాలకు విస్తృత అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ అవగాహన ఒప్పందం ద్వారా ఇరు సంస్థలకు పరస్పర లాభం చేకూరనుంది. ఈ ఎంవోయూ
ద్వారా విద్యార్థులకు పురావస్తు ప్రదేశాలు, మ్యూజియంలు, వారసత్వ కట్టడాలకు ప్రత్యక్ష ప్రాప్యత లభించనుంది. అలాగే ఇంటర్న్‌షిప్ అవకాశాలు, ప్రాయోగిక శిక్షణతోపాటు దాగి ఉన్న కొత్త పరిశోధనా రంగాలను అన్వేషించే అవకాశం కూడా కల్పించనుంది. ఈ అవగాహన ఒప్పందం ప్రధాన ఉద్దేశ్యం కేయూలోని హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్మెంట్, వారసత్వ పరిరక్షణ, మ్యూజియాలజీ, కన్జర్వేషన్, సాంస్కృతిక నిర్వహణ విభాగాల మధ్య దీర్ఘకాలిక సహకారాన్ని ఏర్పరచడం, ఈ సహకారంలో ఇంటర్న్‌షిప్ కార్యక్రమాల నిర్వహణ, తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉమ్మడి వారసత్వ, పర్యాటక, ప్రజా అవగాహన కార్యక్రమాలు ఉన్నాయి.
మ్యూజియం ఆధారిత విద్య, ప్రజలలో వారసత్వ అవగాహన పెంపు, సాంస్కృతిక పర్యాటక అభివృద్ధి, వారసత్వ రంగంలో సామర్థ్య పెంపుదల ఈ ముఖ్య లక్ష్యాలు, ఈ ఎంవోయూ ద్వారా విద్యార్థులు, పరిశోధకులు వారసత్వ రంగంపై ఆసక్తి ఉన్నవారికి విద్యాపరమైనతో పాటు ప్రాయోగిక అనుభవం లభించనుంది.
ఇరు పక్షాలు క్రింది అంశాలలో సహకరించేందుకు అంగీకరించాయి:
వారసత్వ ప్రచారం : ఉమ్మడి ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, అతిథి ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు
పర్యాటక అభివృద్ధి: టూరిజం సర్క్యూట్ లు, గైడెడ్ టూర్ లు, సాంస్కృతిక అవుట్ రీచ్ ద్వారా మ్యూజియం స్మారక చిహ్నాల ప్రచారం
డాక్యుమెంటేషన్: ఆర్కైవ్ పరిశోధనలు, క్షేత్రస్థాయి డాక్యుమెంటేషన్, డిజిటలైజేషన్ ప్రాజెక్టులు
శిక్షణ అండ్ సామర్థ్య పెంపుదల: ఇంటర్న్‌షిప్‌లు, వర్క్‌షాప్‌లు, సెమినార్లు, వారసత్వ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు
సాంకేతిక మద్దతు: క్యూరేషన్, కన్జర్వేషన్, హెరిటేజ్ మేనేజ్ మెంట్లో నిపుణుల మార్గదర్శకత్వం
ప్రజా భాగస్వామ్యం: విద్యా కార్యక్రమాలు, అవుట్ రీచ్ కార్యకలాపాలు, మ్యూజియం కార్యక్రమాల్లో వాలంటీర్ల భాగస్వామ్యం
పరిశోధన: పరస్పర అంగీకారంతో పరిశోధన విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించడం