కాజీపేట, ఏప్రిల్ 7: సమాజంలో ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్త దానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ప్రాణదానం చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. కాజీపేట పట్టణం 61 వ డివిజన్ పరిధిలోని వడ్డేపల్లి ట్యాంక్ బండ్ పై స్థానిక వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. రక్త దాతలకు ప్రశంస పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్డేపల్లి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభి నందనీయమన్నారు. అన్ని దానాల కెల్లా రక్త దానం మిన్న అన్నారు. సమాజంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఈ శిబిరంలో సేకరించిన రక్తం ఎంత ఉపయోగ పడుతుందన్నారు. ప్రజలు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం లో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బొల్లపల్లి రాజేశ్వర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి సంజీవ రెడ్డి, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కైలాస అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.