హనుమకొండ, నవంబర్ 10 : చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో కార్తికమాసం శివప్రీతికరమైన మూడో సోమవారం పురస్కరించుకుని 51 కిలోల భస్మంతో ‘భస్మోధూళీతాభిషేకం’ నిర్వహించారు. 200 మంది పుణ్యదంపతులచే సామూహిక రుద్రాభిషేకాలు నిర్వర్తించి గజమాలతో రుద్రేశ్వరున్ని అలంకరించారు. సప్తహారతులు వారణాసి నుంచి తెప్పించిన బిల్వనంది సింహనాగ రుద్రకుంభ నక్షత్రహారతులు ఇచ్చేక్రమంలో ఓంకారంతో మార్మోగింది. నీరాజన మంత్రపుష్పాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
సాయంకాల సమయంలో సంస్కృతి, భక్తి విశ్వాసాలకు, నిలయమైన కార్తీకంలో దేశభక్తి, దైవభక్తి, దేశసంకల్పాలను రాబోయే తరాల వరకు వెలిగేలా మహిళలందరూ సామూహికంగా దీపాలను ప్రకాశింపజేశారు. వైదిక కార్యక్రమాలను ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఆలయ వేద పండితుడు గంగు మణికంఠశర్మ, సందీప్‌శర్మ, ప్రణవ్ నిర్వర్తిచారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి డి.అనిల్‌కుమార్, దేవాలయాన్ని సందర్శించిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.