హనుమకొండ చౌరస్తా, మార్చి 9: పదవుల కోసం పార్టీలు, కండువాలు మార్చే రాజకీయ ఊసరవెల్లి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పద్మశ్రీ మందకృష్ణ మాదిగను విమర్శించే నైతిక హక్కు లేదని మహాజన సోషలిస్టు పార్టీ(ఎమ్మెస్పీ) జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార్ మాదిగ విమర్శించారు. సోమవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో మంద కుమార్ మాట్లాడుతూ తన రాజకీయ మనుగడ కోసం, పదవుల కోసం నిరంతరం పార్టీలు, కండువాలు మార్చే కడియం శ్రీహరి మందకృష్ణ మాదిగను విమర్శించే స్థాయిలేదన్నారు. మొదట టీడీపీ, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రస్తుతం కాంగ్రెస్‌లో పదవుల కోసం తన రాజకీయ ప్రయోజనాల కోసం ఊసరవెల్లిలా రంగులు మార్చే కడియం శ్రీహరి, ఉద్యమ పంథాని ఎన్నుకొని హక్కుల కోసం ఉద్యమించే మందకృష్ణ మాదిగను విమర్శించడం ఆయన రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.
కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ కోసం ఏమి చేశారో శ్రీహరి ప్రజానీకానికి వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల మాదిగ ఉద్యోగుల సంఘాల నాయకుల పేరిట ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసీం విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణల్లో ఏసీబీకి పట్టుబడిన మేడి రమేష్‌లు ముఖ్యమంత్రికి సన్మానం చేయడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. పదవుల కోసం ప్రొఫెసర్ ఖాసీం, మేడి రమేష్‌లు రేవంత్‌రెడ్డిని
సన్మానించిన సభ భజనపరుల సభ అని ఆయన దుయ్యబట్టారు. పదవుల కోసం కడియం శ్రీహరి, కడియం కావ్య, వేం నరేందర్‌రెడ్డి, ప్రొఫెసర్ ఖాసీం, మేడి రమేష్‌లు మందకృష్ణ మాదిగను విమర్శించేస్థాయి వారికి లేదని మందకుమార్ మాదిగ అన్నారు. ఈ సమావేశంలో నాయకులు వేల్పుల సూరన్న, పుట్టి రవి, పుట్ట బిక్షపతి, మంద రాజు, గందల సుకుమార్, జన్ను దినేష్, గంగారపు శ్రీను, ఏ.వెంకటస్వామి, రవీందర్, జెరిపోతుల సారంగపాణి, రాజారపు కిరణ్ పాల్గొన్నారు.