వేలేరు : హన్మకొండ జిల్లా వేలేరు మండలంలోని పలు గ్రామాల్లో నిన్న రాత్రి వీచిన ఈదురుగాలుల ప్రభావంతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. బలమైన గాలులు వీచడంతో మండలంలోని అనేక గ్రామాల్లో మొక్కజొన్న మరియు వరి పంటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా మొక్కజొన్న, వరి పంటలు నేలకొరిగి భారీ నష్టం వాటిల్లిందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అప్పులు చేసి పంటలు సాగుచేసిన రైతులకు ఈదురుగాలులు భారీ నష్టాన్నే మిగిల్చాయని రైతులు బోరున విలపిస్తున్నారు. దెబ్బతిన్న పంటలను అధికారులు వెంటనే పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపాలని, అలాగే నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.