HomeWarangal-ruralLeaks And Road Repairs Should Be Undertaken Immediately
లీకేజీలు, రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలి..
నగర మేయర్ గుండు సుధారాణి
వరంగల్ : గ్రేటర్‌లోని పైప్‌లైన్ లీకేజీలను అరికట్టాలని, రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం కార్పొరేషన్లో ఇంజినీరింగ్, పబ్లిక్ హెల్త్ అధికారులతో ఆమె ఇంటింటికి తాగునీటి సరఫరా, నల్లా కనెక్షన్లు, వాల్వ్ మార్పు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. ప్రభుత్వ లక్ష్యం మేరకు గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో వందల సంఖ్యలో పైన్లైన్ లీకేజీలు ఉన్నాయని వాటిని వెంటనే అరికట్టాలని ఆదేశించారు. మిషన్ భగీరథ పైప్‌లైన్ పేరుతో తవ్విన రోడ్డు అలాగే వదిలివేశారని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వాటిని మరమ్మతు చర్యలు చేపట్టాలని అన్నారు.
తాగునీటి సరఫరాలో ఉన్న సమస్యలను జోన్ల వారిగా గుర్తించి వాటి పరిష్కారానికి బల్దియా, పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఈ నెల చివరి వరకు గ్రేటర్ కార్పొరేషన్‌లోని ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా అందించాలని మేయర్ ఆదేశించారు. శివనగర్, పుప్పాగుట్ట, బోడగుట్ట పరిధిలోని ప్రాంతాలలో తాగునీటి సరఫరాలో ఇబ్బందులను తొలగించాలని ఆమె అధికారులకు సూచించారు.
తాగునీటి సరఫరాతో తలెత్తుతున్న సమస్యలను రెండు శాఖ అధికారులు సమన్వయంతో పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ఈఈలు శ్రీనివాస్, శ్రీనివాస రావు, రాజ్‌కుమార్, డీఈలు సంతోష్ బాబు, రవికుమార్, రవికిరణ్, నరేందర్, శ్రీనాథ్‌రెడ్డి, నస్రత్ జహన్,ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.