హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 3: హనుమకొండ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో బ్యాడ్మింటన్ కోచ్‌గా పనిచేస్తున్న కురపాటి రమేష్ ప్రతిభకు గుర్తింపు లభించింది. తెలంగాణ బ్యాడ్మింటన్ జట్టుకు ఆయన కోచ్‌గా ఎంపికయ్యారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో సెప్టెంబర్ 5 నుంచి 8వ తేదీ వరకు జరగనున్న 80వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్-2026లో పాల్గొనే తెలంగాణ జట్టు క్రీడాకారులకు కోచ్‌గా రమేష్ సేవలందించనున్నారు.
తెలంగాణ బ్యాడ్మింటన్ జట్టు కోచ్‌గా ఎంపికైన కురపాటి రమేష్‌ను అందరూ అభినందించారు. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుల్లెల గోపీచంద్, హనుమకొండ యువజన క్రీడా అధికారి కొత్త ప్రశాంత్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రమేష్, కార్యదర్శి రమేష్‌రెడ్డి, కోశాధికారి నాగకిషన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సీనియర్ బ్యాడ్మింటన్ కోచ్ శ్రీధర్, డీఎస్ఏ కోచ్‌లు, సీనియర్ క్రీడాకారులు రమేష్‌ను ఘనంగా అభినందించారు. తెలంగాణ జట్టుకు కోచ్‌గా ఎంపిక కావడం హనుమకొండ జిల్లా బ్యాడ్మింటన్‌కు గర్వకారణమని వారు పేర్కొన్నారు. రమేష్ తన అనుభవంతో క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించి, పోటీల్లో తెలంగాణ జట్టు సత్తా చాటేలా కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.