భీమదేవరపల్లి, డిసెంబర్ 29: గ్రామం ఆదర్శంగా నిలవాలంటే పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి సర్పంచ్ మాచర్ల కుమారస్వామి అన్నారు. సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. మహిళా సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు మరువలేనివని అన్నారు.
జీతాలు తక్కువగా ఉన్నా సమాజ సేవలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని అభినందించారు. నూతనంగా గెలుపొందిన పాలక వర్గానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఐలయ్య, వార్డు సభ్యులు ప్రేమలత, సదయ్య, శ్రీనివాస్ రెడ్డి, లలిత, అశోక్, వెంకటేశ్వర్లు, శ్యామ్, విజయ, సంధ్య, పంచాయతీ సెక్రటరీ రాజు పాల్గొన్నారు.