బచ్చన్నపేట: జనవరి 27: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేట గ్రామంలో ఇసుక మాఫియా నిబంధనలకు విరుద్ధంగా రేయింబవళ్లు అక్రమ తవ్వకాలు, రవాణా జరుగుతోందని రైతులు తిరుగుబడ్డారు. ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ పనుల పేరుతో, అనుమతుల మాటున పెద్దవాగులోని ఇసుకను కమర్షియల్ అవసరాలకు తరలిస్తూ లక్షలాది రూపాయల సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దోపిడీ వల్ల రైతులు తమ బోరు బావులు ఎండిపోయి భూగర్భ జలాలు పడిపోవడమే కాకుండా, పర్యావరణానికి తీవ్ర ముప్పు కలుగుతోందని, అక్రమ ఇసుక దందా ను ఆపివేయాలని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంగళవారం ఉదయం 8 వరకే దాదాపు 25 ట్రాక్టర్లు వాగులోకి వచ్చాయని, కేవలం నాలుగింటికే అనుమతులు ఉన్నాయని, రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.3 కోట్ల 30 లక్షలతో ప్రభుత్వం చెక్ డ్యామ్ నిర్మిస్తే చెక్ డాం కిందనే గోతులు తవ్వి ఇసుక దందా రవాణా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఇసుక దందాపై అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతోనే ఇసుక దళారుల సొమ్ము చేసుకొని రైతులపై దాడులు చేస్తున్నారన్నారని వాపోయారు. రాత్రివేళ కూడా కొందరు ఇసుక దందాను కొనసాగిస్తున్నారని, ఇప్పటికే తమ భూములు కోతకు గురైన్నాయని, నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై పోలీసు, రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం వల్ల రైతులు సహకరించాలని, ప్రభుత్వ పోరంబోకు భూములోనే ఇసుక హద్దులు చూపిస్తారని, ఈ ప్రాంగణంలోనే ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక తరలించాలని సూచించారు. రైతుల భూముల వద్ద కానీ, చెక్ డ్యాముల వద్ద కానీ, ఇసుకతోడుస్తే రైతులు తమకు ఫిర్యాదు చేస్తే ట్రాక్టర్లను సీజ్ చేస్తామని ఎస్ఐ ఎస్కే హమీద్ వెల్లడించారు.