హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 22: నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) ఆధ్వర్యంలో ‘టాక్ ఆన్ ఐఏఎస్ ఆస్పిరెంట్స్’తో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐఏఎస్, బెంగళూరు నార్త్ సిటీ కార్పొరేషన్ కమిషనర్ పొమ్మాల సునీల్‌కుమార్(వరంగల్ నిట్‌లో బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ఇంజినీరింగ్ 2002 బ్యాచ్ పూర్వవిద్యార్థి) ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ పరీక్ష, సన్నద్ధతా వ్యూహాలు, కెరీర్ అవకాశాలు, ప్రజా పరిపాలనలో బాధ్యతలు తదితర అంశాలపై విలువైన అవగాహన లభించింది.
వరంగల్ ఎన్ఐటీ నుంచి భారతీయ పరిపాలనా సేవ వరకు సాగిన తన ప్రయాణాన్ని పంచుకున్నారు. ప్రజా సేవలో కెరీర్‌ను ఎంచుకునే వారికి అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర కృషి, స్పష్టమైన లక్ష్యం ఎంతో ముఖ్యమని వివరించారు. బలమైన పట్టు సాధించడం, పద్ధతిబద్ధమైన ప్రణాళికతో సన్నద్ధత కొనసాగించడం, సమకాలీన అంశాలపై అవగాహన పెంపొందించుకోవడం, విశ్లేషణాత్మక, కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం, నిరంతర కృషిని కొనసాగించడం వంటి అంశాల ప్రాధాన్యతను ఆయన వివరించారు.
సివిల్ సర్వీసెస్ అనేది కేవలం ఒక పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం మాత్రమే కాదని, ప్రజలు, పాలన, ప్రజా సంక్షేమం పట్ల బాధ్యతను స్వీకరించడం కూడా అంతే ముఖ్యమన్నారు. వైఫల్యాలు, ఎదురయ్యే సవాళ్ల నుంచి నేర్చుకోవాలని, సరైన మార్గదర్శకత్వం మరియు మెంటార్ షిప్ ను పొందాలని, దీర్ఘకాలిక లక్ష్యాల పట్ల నిబద్ధతతో ముందుకు సాగాలని విద్యార్థులను ప్రోత్సహించారు.