హనుమకొండ, జూలై 16 : కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరితో 40 రోజుల నుంచి రైస్ మిల్లులు తెరుచుకోలేని పరిస్థితి ఏర్పడిందని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి వెంకటేశ్వర్రావు, ప్రధాన కార్యదర్శి పాడి గణపతిరెడ్డి, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోనెల రవీందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవునూరి అంజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. హనుమకొండ హంటర్‌రోడ్డులోని రైల్ మిల్లర్స్ అసోసియేషన్ భవన్లో శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. హనుమకొండ జిల్లాలో 2.50లక్షల టన్నులు, వరంగల్ జిల్లాలో సుమారు 4లక్షల టన్నుల ధాన్యం మిల్లుల్లో పేరుకుపోయిందన్నారు. జాగా లేకున్నా మిల్లుల బయట ధాన్యాన్ని దిగుమతి చేసుకుని ప్రభుత్వానికి సహకరించామన్నారు. జూన్ 7 నుంచి ఎఫ్‌సీఐ సీఎంఆర్ తీసుకోకపోవడంతో మిల్లులు కూడా మూతపడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి లేకపోవడంతో మిల్లు కార్మికులు వారి ప్రాంతాలకు వెళ్లారని తెలిపారు.
భారీ వర్షాలకు నీరు చేరి ధాన్యం తడిసి మొలకెత్తి, మురిగిపోయిందన్నారు. హమాలీలకు వేతనాలు, కరంట్ బిల్లు లు, బ్యాంకు రుణాలు చెల్లించలేక మిల్లర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైస్ ఇండస్ట్రీపై మిల్లర్లే కాకుండా, రైతుల భవిష్యత్ కూడా ఆధారపడి ఉందని చెప్పారు. 40 సంవత్సరాల రైస్ ఇండస్ట్రీ చరిత్రలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదన్నారు. కేంద్రం ప్రభుత్వం రా రైస్, బాయిల్డ్ రైస్, నిలిపివేసిన సీఎమ్మార్‌ను వెంటనే ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తడిసిన, ముక్కిపోయిన, మురిగిపోయిన ధాన్యం మిల్లింగ్ చేయించి ఎలా ఉన్నా కొనుగోలు చేయాలన్నారు. లేకపోతే 2021-22 సీజనల్ సీఎంఆర్ విషయంపై ప్రతి మిల్లర్ ఇచ్చిన ఇద్దరు మిల్లర్ల ష్యూరిటీ, అసోసియేషన్ గ్యారంటీని విరమించుకోనున్నట్లు స్పష్టం చేశారు. సీఎంఆర్ తీసుకోకపోతే వెంటనే ధాన్యాన్ని ప్రభుత్వ గోదాములకు తరలించాలని, నష్టపోయిన మిల్లర్లకు 25 శాతం చొప్పున పరిహారం చెల్లించాలన్నారు. స్పందించకుంటే ఆత్మహత్య చేసుకుంటాహని హెచ్చరించారు. సమావేశంలో హనుమకొండ, వరంగల్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బెల్దె కిషన్, తక్కళ్లపల్లి యుగేంధర్, మల్లేశం, వెంకటేశ్వర్రావు, సత్యనారాయణ, ఇరుకుళ్ల రమేశ్, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
ధాన్యం మొలకలొస్తున్నాయ్…
ఖానాపురం : రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఆయా కొనుగోలు కేంద్రాల పరిధిలోని రైస్‌మిల్లులకు కేటాయించింది. మిల్లర్లు ధాన్యా న్ని బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి పంపిస్తున్నారు. 45 రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం బియ్యం సేకరణను నిలిపివేసింది. దీంతో మండలంలోని అశోక్‌నగర్‌లోని ఇర్కు కోటేశ్వర్రావుకు చెందిన శ్రీదత్తసాయి రైస్‌మిల్లులో నిల్వచేసిన 8వేల బస్తాల ధాన్యం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తడిసి మొలకలొచ్చింది. దీంతో మిల్లు యజమాని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.