ధర్మసాగర్ : ప్రైవేట్ బడిలో చదివితే ప్రభుత్వ పథకాలలో కోత ఉంటుందని ప్రకటనకే పరిమితం కాకుండా ఆ సర్పంచ్ ఇల్లిల్లు తిరుగుతూ ప్రజల్లో చైతన్యం కల్పించారు. హనుమకొండి జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామ సర్పంచ్ గుంటుపల్లి రేణుక క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. గత నాలుగు రోజుల నుంచి ప్రతి ఇల్లు కలియతిరిగిన గ్రామ సర్పంచ్ ఏకంగా అడవి బాట పట్టారు. సోమవారం ముప్పారం- ఎర్రబెల్లి శివారులోని అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి 160 మంది ఉపాధి కూలీలతో మాట్లాడారు.
తమ ఇళ్లల్లో ఉన్న చిన్నారుల వివరాలను స్వయంగా నమోదు చేసుకొని ఆ పేర్లను ప్రాథమిక పాఠశాలకు అప్పగించారు. తమ పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్పిస్తే కలిగే ప్రయోజనాలపై వివరించారు. ప్రవేట్ బడులలో చేర్పిస్తే లక్షలక్షలు వృధా అవుతాయని ఆ డబ్బులు పొదుపు చేసుకోవచ్చని సూచించి ఫలితాలను రాబట్టారు. మూడు రోజుల్లో 110 అడ్మిషన్లను ప్రభుత్వ బడిలో చేర్పించేలా కృషి చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు వార్డు సభ్యులు కలిసి నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో 110 మంది విద్యార్థులు నమోదు అయినట్టు సర్పంచ్ రేణుక తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు మెరుగుపరచడమే తమ లక్ష్యమని ఇందులో భాగంగా పాఠశాల భవనానికి త్వరలో రంగులు వేయడంతో పాటు సకల సౌకర్యాలు కల్పించడంతోపాటు విద్యార్థులకు ఘన స్వాగతం పలుకుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ తాళ్లపల్లి కుమారస్వామి గౌడ్, గ్రామ విద్యాశాఖ బాధితులు నరేడ్ల రాజేష్, పంచాయతీ రాజ్ శాఖ ఉపాధ్యాయులు వెల్దండి శ్వేత సాగర్, మహిళా శిశు సంక్షేమ శాఖ బాధ్యులు ముంజ కృష్ణవేణి గౌడ్ లతో పాటు ముప్పారం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ లు పాల్గొన్నారు