హనుమకొండ చౌరస్తా, జూలై 6: పోలీసుల అవినీతి నశించాలంటూ దుగ్గొండి మండలం పొనకల్లు గ్రామానికి గట్ల సురేందర్ పోర్లు దండాలు పెడుతూ వినూత్ననంగా నిరనన తెలిపారు. సోమవారం హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్లో పోలీసుల అవినీతి నశించాలంటూ ప్లకార్డు పట్టుకుని రోడ్డుపై పోర్లుదండాలు పెడుతూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గట్ల సురేందర్ మాట్లాడుతూ మా తాతల నుంచి వచ్చిన భూమిని మా తమ్ముడు ఆక్రమించుకుని భూకబ్జాదారులకు అమ్ముకున్నాడని, వారు తనపై దాడి చేశారని, తన భూమిని ఆక్రమించినవారిపై చర్యలు తీసుకోకుండా పోలీసులు, తహసీల్దార్ కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు.
తనకు భూకబ్జాదారుల నుంచి ప్రాణభయం ఉందని వాపోయారు. ఈ సమాజంలో లంచం ఇచ్చినోడికి ఒక న్యాయం ఇవ్వనోడికి ఒక న్యాయమాలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు లంచం తీసుకుని పనిచేస్తున్నారని, దొంగ పట్టాలు చేసిన దుగ్గొండి గత తహసీల్దార్ బట్టలు ఊడదీసి పాత చెప్పులు, చీపుర్లు మెడకు వేసి వరంగల్ జిల్లా నడిబొడ్డున ఊరేగించాలని డిమాండ్ చేశారు.
నాపై హత్యా ప్రయత్నం చేసిన భూకబ్జాదారులను వెంటనే కోర్టులో హాజరుపర్చాలని డిమాండ్ చేశారు. నేను చెప్పింది నమ్మకుంటే తడిబట్టలతో భద్రకాళి అమ్మవారి గుడి వద్ద ప్రమాణం చేస్తానన్నారు. తనకు న్యాయం చేయాలని కలెక్టర్, పోలీస్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసేందుకు పోర్లు దండాలు పెట్టినట్లు తెలిపారు. న్యాయం కోసం గాంధీభవన్‌లో ఆమరణ దీక్ష చేస్తానని సురేందర్ హెచ్చరించారు.