భూపాలపల్లి రూరల్, సెప్టెంబర్ 28: బతుకమ్మ పండుగ వేళ మహిళలు ఆనందంగా గడుపాల్సి ఉండగా యూరియా కోసం వారు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చుని ఇబ్బంది పడుతున్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా జంగేడులోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం వేచి ఉన్న రైతులను ఆయన కలిశారు. రైతులు తెల్లవారుజామున 5 గంటల నుంచే యూరియా కోసం బారులు తీరిన విషయం తెలుసుకున్న గండ్ర వెంకటరమణారెడ్డి పరిస్థితిని పరిశీలించారు.
పద్ధతి ప్రకారం క్లస్టర్ల వారీగా రైతులకు యూరియా పంపిణీ చేయాలని సొసైటీ చైర్మన్ మేకల సంపత్కు సూచించారు. అనంతరం గండ్ర విలేకరులతో మాట్లాడుతూ జంగేడు సొసైటీకి 500 యూరియా బస్తాలు వస్తే వెయ్యి మందికి పైగా రైతులు వేచి ఉన్నారని తెలిపారు. రైతులకు యూరియా లభించకపోవడంతో ఆవేదన చెందుతున్నారని వివరించారు. బతుకమ్మ, దసరా పండుగలకు బంధుమిత్రులు ఇంటికి వస్తే వారితో కలిసి బతుకమ్మ ఆడుతూ ఆనందంగా గడిపే సమయంలో యూరియా కోసం క్యూలైన్లో నిలబడే పరిస్థితి వచ్చిందన్నారు.
దీనికి కారణమైన కాంగ్రెస్ పాలన పై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వెంకటరమణారెడ్డి అన్నారు. వరి పండిస్తున్న రైతుల వివరాలు సేకరించి నేరుగా యూరియా ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. సరిపడా స్టాక్ ఉన్నప్పటికీ యూరియా తెప్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి యూరియా అందించాలని కోరారు.