కాజీపేట, మార్చి 4 : చర్లపల్లి నుంచి హౌరాకు వెళ్తున్న ఈస్ట్ కోస్ట్ రైల్లో ఓ మహిళా ప్రయాణికురాలు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వైద్యులు ప్రథమ చికిత్స చేసి 108 వాహనంలో ఎంజీఎం దావఖానకు తరలించిన సంఘటన బుధవారం జరిగింది. రైల్వే అధికారులు, 108 సిబ్బంది తెలిపిన వివరాలు ప్రకారం..కోల్కతాకు చెందిన పింకీ సాహా (31) వివాహిత కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కు చికిత్స నిమిత్తం వచ్చారు. కోల్కతాకు తిరుగు ప్రయాణంలో ఈస్ట్ కోస్ట్ రైలు బయలుదేరిన అరగంట తర్వాత పింకీకి విపరీత మైన కడుపునొప్పి, ఆయాసంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది.
కుటుంబ సభ్యులు రైలు టీటీకి సమాచారం తెలపడంతో ఆయన రైల్వే ఉన్నతాధికారులకు విషయాన్ని చేరవేశారు. రైల్వే అధికారుల ఆదేశాలతో స్థానిక రైల్వే అధికారులు కాజీపేటకు రైలు వచ్చే సమయంలోనే 108 వాహనానికి సమాచారం అందించి రప్పించారు. కాజీపేటకు రైలు చేరుకోగానే 108 సిబ్బంది ఈఎన్టీ చైతన్య, పైలట్ కుమార స్వామి అస్వస్థతకు గురైన పింకీకి ప్రాథమిక వైద్యం అందించారు. పరిస్థితి అదుపులోకి రాక పోవడంతో బాధితు రాలని వరంగల్ ఏంజీఎం దావఖానకు తరలించారు.