జనగామ రూరల్ మే 15 : అరుగాలం పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు నానా తిప్పలు పడుతున్నారు. జిల్లాలోని ఏ గ్రామంలో చూసినా ధాన్యం రాశులే కనబడుతున్నాయి. ఇప్పటికి రెండు నెలలు అయినా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలకు లారీలు రాక ధాన్యం లిఫ్టింగ్ చేయక రైతులు ఆవేదన చెందుతున్నారు.
దీంతో విసుగు చెందిన రైతులు జనగామ మండలం పెంబర్తి గ్రామంలో వరంగల్- హైదరాబాద్ నేషనల్ హైవేపై రైతులు ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టి రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులను బుజ్జగించారు. ధాన్యం కొనుగోలు చేసిన బస్తాలను మిల్లులకు తరలించడానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి రైతుల ఇబ్బందులను తొలగించాలని వేడుకుంటున్నారు.