భీమదేవరపల్లి, మార్చి 12: రైతులకు మెరుగైన విద్యుత్ సేవలు(Electricity services )అందించడమే లక్ష్యమని హనుమకొండ రూరల్ డివిజనల్ ఇంజినీర్ సామ్యా నాయక్ తెలిపారు. బుధవారం మండలంలోని కొత్తకొండ సెక్షన్ లో గల ముత్తారం గ్రామంలో పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి విద్యుత్ సమస్యలను అధిగమిస్తున్నామని తెలిపారు. ట్రాన్స్ ఫార్మర్లు ఫెయిల్ కాకుండా ఎర్తింగ్ సరిగా ఉండేటట్లు సిబ్బంది పనులు చేస్తున్నారని వివరించారు. విద్యుత్ మోటార్లకు తప్పనిసరిగా కెపాసిటర్లు పెట్టుకోవాలని రైతులకు సూచించారు.
కెపాసిటర్లు అమర్చడం వల్ల విద్యుత్ మోటార్లు మరింత కాలం మన్నికగా ఉంటాయని, తద్వారా లోవోల్టేజి సమస్య లేకుండా దోహదపడుతుందని పేర్కొన్నారు. ఆటో స్టాటర్లు తొలగించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. జీరో విద్యుత్ ప్రమాదాల లక్ష్యంగా సర్కిల్లోని డీఈ టెక్నికల్ అధికారులను సేఫ్టీ అధికారులుగా నియమించామని పేర్కొన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణపై రైతులకు విస్తృత ప్రచారం కల్పించి చైతన్యం కల్పిస్తున్నామని వెల్లడించారు.
ఇందులో భాగంగా వంగిన విద్యుత్ పోల్స్ ను సరి చేయడం, వేలాడుతున్న విద్యుత్ లైన్లను స్టీరింగ్ చేయడం, విద్యుత్ వైర్లకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించామన్నారు. ఈ కార్యక్రమంలో భీమదేవరపల్లి ఏడీఈ రాజేశ్వరరావు, ఏఈ శిరీష్ కుమార్, సబ్ ఇంజినీర్ సుదర్శన్, లైన్ ఇన్స్పెక్టర్లు సంపత్, దాసు, సిబ్బంది వెంకటరెడ్డి, రామకృష్ణ, అరవింద్, సంతోష్, దినేష్, రాజకుమార్, నవీన్, సాంబయ్య, రాజిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.