హనుమకొండ చౌరస్తా, మే 30 : కాంగ్రెస్ 18 నెలల పాలనలో సుమారు 100 మందికిపైగా ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆటోకార్మికుల జీవితాలు ఆగమయ్యాయని ఆత్మహత్యలు చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా కార్మిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్మిక మాసోత్స వాల్లో భాగంగా శుక్రవారం హనుమకొండ బస్టాండ్ వద్ద ఉన్న శ్రీరుద్రమదేవి ఆటో స్టాండ్‌ను ఆయన సందర్శించారు. ఆటో స్టాండ్ పరిసర ప్రాంతాలు దుర్గంధం, మురికినీరుతో నిండిపోవడంతో ఆర్టీసీ ఆర్ఎంవో మాట్లాడి ఆటోస్టాండ్ వద్ద మౌలిక వసతులు కల్పించాలని కోరారు. సంక్షేమ పథకాల అమలుకు మేం వ్యతిరేకం కాదు కానీ మా ఆటో కార్మికుల జీవనోపాధిని ప్రభుత్వం మరిచిందన్నారు.
ఎన్నికల హామీల్లో భాగంగా ఆటో కార్మికులకు ఇస్తామన్న రూ.12000 భృతిని ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. కార్మిక మాసోత్సవాల్లో భాగంగా ఆటోకార్మికుల స్థితిగతులను అధ్యయనం చేశామని, వారి కుటుంబం గడవడం ఇబ్బందవుతుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైల్వేస్టేషన్లలో ఆటో అడ్డాలు ఉండేవి. రైల్వే అధికారులు ఎలాంటి నగదు వసూలు చేసేవారు కాదు ఇప్పుడు ఆటోకార్మికుల వద్ద నగదు వసూలు న్యాయం కాదన్నారు. ఆటో కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆటో కార్మిక యూనియన్ నాయకులు రవీందర్‌రెడ్డి, సంజీవ, బాబు, శ్రీధర్‌రెడ్డి, జయరాం, కుమార్, రమేష్, రాజయ్య, అనిల్, నవీన్, మొగిలి, సాంబయ్య, దేవేందర్, రవి పాల్గొన్నారు.