హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 6: ఈనెల 12న జరిగే కార్మిక దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దామని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్‌భాస్కర్ పిలుపునిచ్చారు. కార్మిక సంఘాల ఉమ్మడి సన్నాహాక సమావేశాన్ని శుక్రవారం హనుమకొండ అశోకా కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ 4 లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్ర భుత్వం రైతు, కార్మిక, ఉద్యోగుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు.
కార్మికులకు, ఉద్యోగులకు పనిభారం పెంచి, వేతనాలు తగ్గించి శ్రమ దోపిడీ చేసేందుకు పెట్టుబడిదారుల కుట్రలకు కేంద్రం వత్తాసు పలుకుతూ నాలుగు లేబర్ కోడ్స్‌ను తీసుకొచ్చిందని వివరించారు. రైతుల స్ఫూర్తితో కార్మికులు హక్కుల సాధన కోసం ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. అసంఘటిత, సంఘటిత కార్మిక సంఘాలన్ని కలిసి ఈనెల 12న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని వినయ్‌భాస్కర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ, బీఆర్టీయూ, టీఎన్టీయూసీ, ఐఎఫ్ టీయూ, ఏఐసీటీయూ, వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.