హనుమకొండ చౌరస్తా, మార్చి 16: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వైఫల్యంతోనే దేశంలో చమురు సంక్షోభం నెలకొందని సీపీఐ రాష్ర్ట సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. గ్యాస్, పెట్రోల్ ధరలను తగ్గించాలని, చమురు సంక్షోభాన్ని నివారించాలని డిమాండ్ చేస్తూ సోమవారం హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేస్తూ కట్టెలపొయ్యిపై వంట చేశారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ నేడు నెలకొన్న ఈ సంక్షోభం మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న దూరదృష్టి లేని విధానాలు, తప్పుడు ప్రాధాన్యతల ప్రత్యక్ష ఫలితం అన్నారు.
ప్రభుత్వం తన విదేశాంగ విధాన ఎంపికల పరిణామాలను, భారతదేశ ఇంధన భద్రత, సరఫరాపై వాటి ప్రభావాన్ని అంచనా వేయడంలో విఫలమైందన్నారు. వినియోగదారులను రక్షించడానికి బదులుగా, ఆ భారాన్ని పూర్తిగా ప్రజలపై పడేలా చేసిందని, ఈ వైఫల్యాల పరిణామాలను ఎదుర్కోలేక, ప్రధానమంత్రి ఉపశమనం కల్పించడం కంటే ప్రతిపక్షంపై దాడి చేయడంలో బిజీగా ఉన్నారన్నారు.
వాణిజ్య సిలిండర్లపై ఆధారపడిన చిన్న తినుబండారాలు, టీ స్టాళ్లు, దాబాలు, రెస్టారెంట్లపై కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉందన్నారు.
కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ర్ట కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, రాష్ర్ట సమితి సభ్యులు సిరబోయిన కరుణాకర్, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, నాయకులు మోతె లింగారెడ్డి, ఉట్కూరి రాములు, కర్రె లక్ష్మణ్, స్టాలిన్, ఎదునూరి వెంకట్రాజం, మునిగాల భిక్షపతి, బత్తిని సదానందం, కొట్టెపాక రవి, మాలోత్ శంకర్ నాయక్ , కొట్టే వెంకటేష్, అదరి రమేష్, వేల్పుల సారంగపాణి, కండె నర్సయ్య, గుంటీ రాజేందర్, కామెర వెంకట రమణ, అలువాల రాజు, యాళ్ల సంజయ్, లకావత్ లక్ష్మి, భూక్యా స్వరూప, గోకాల రాజయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.